23, మార్చి 2015, సోమవారం

యతిభేదాలు - 1

యతి భేదాలు
అ) స్వరయతులు, ఆ) వ్యంజన యతులు, ఇ) ఉభయ యతులు, ఈ) ప్రాస యతి.

అ) స్వర యతులు - స్వరం అంటే అచ్చు. అచ్చులయొక్క మైత్రిని చెప్పడం వల్ల ఇవి స్వరయతులు.

1. స్వరప్రధానయతి:- పదాలమధ్య సంధి జరిగినపుడు రెండవపదం మొదటిఅచ్చుకే యతి చెల్లించాలి. 
(ఉభయయతులలో ఈ నియమం చెల్లదు).
ఉదా-
*అతులవిక్రముఁ డతఁడు వి*ద్యాధికుండు (విద్యా +*అధికుండు)

2. స్వరయతి :- i) అ-ఆ-ఐ-ఔ; ii) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ; iii) ఉ-ఊ-ఒ-ఓ. ఈ మూడు వర్గాలలో ఆయా వర్గాలలోని 
అచ్చులతో పరస్పరం యతి చెల్లడం.
అప్పకవి ఉదా-
i) *అబ్జపత్రనేత్ర *ఆర్తావనచరిత్ర
    *ఆతతాయిజైత్ర *ఐంద్రమిత్ర
    *ఐందవప్రగోత్ర *ఔర్వశేయస్తోత్ర.
ii) *ఇందువంశసోమ *ఈశ్వరీనుతనామ
     *ఈడితాంగధామ *ఋషభభీమ
     *ఋక్షజాభిరామ *ఎటులైన మాభామ
     *ఎడఁ గటాక్ష ముంచి *ఏలు మనఁగ.
iii) *ఉరగరాజశాయి *ఊర్ధ్వవిష్టపదాయి
       *ఊర్జితోరుకీర్తి *ఒడలికార్తి
       * ఒడవకుండఁ బ్రోచి *ఓలి దాసునిఁ గాంచి.

౩. గూఢస్వరయతి:- అన్యోన్య, పరోక్ష మొదలైన పదాలలో గూఢంగా ఉన్న పరపదం మొదటి అకారానికి మాత్రమే యతి చెల్లడం.
ఉదా- అ|*న్యోన్యవిరుద్ధభాషణము *లాడినఁ దత్ఫల మాతఁ డందెడున్. (అన్య+*అన్య... భాషణములు+*ఆడిన) [భారత.ఉద్యోగ. ౧.౩౨]

4. లుప్తవిసర్గకస్వరయతి :- దాసః+అహం, తమః+అర్క మొదలైన చోట్ల అకారం తరువాతి విసర్గకు అకారం పరమైనపుడు విసర్గ, దాని ముందువెనుకల అకారాల స్థానంలో ఓకారం ఆదేశమై దాసోహమ్, తమోర్క అవుతుంది. ఇక్కడ ఉత్తరపాదాది అకారానికే యతి చెల్లుతుంది. 
ఉదా-
*అపరిమితానురాగసుమ*నోలసమై చిగురాకు జేతులం (*అపరిమిత.... సుమనః+*అలసమై) [మనుచ. ౩.౨౭]
తే|*జోऽసహ్యున్ శరజన్ముఁ గాంచి యల నీ*హారక్షమాభృత్కుమా (తేజః+*అసహ్యున్... నీ*హార...) [విజయ. ౧.౧౧౪]

5. ఋయతి:- ఇ,ఈ.ఎ.ఏ లతో కూడిన రేఫ(రి,రీ,రె,రే)లకు ఋకారంతో యతి చెల్ల్లుతుంది. దీనినే ‘రియతి’ అనికూడ అంటారు.
ఉదా-
*ఋత్విజుండని విచా*రించి పూజించితే... [భారత.ఆది. ౨.౧౧]

6. ఋత్వసంబంధయతి:-  ఒక హల్లుతో కూడిన ఋకారానికి (కృ, తృ, పృ మొ.) ఇ,ఈ,ఎ.ఏ,ఋ,ౠలు ఈ అచ్చులతో కూడిన య,హలకు యతి చెల్లుతుంది. (కృ- ఇ,ఈ.ఎ.ఏ,ఋ,ౠ,హి,హె,హృ,యి,యె మొ.).
అప్పకవి ఉదా-
*ఇనతనూభవుండు *పృషదశ్వసుతు నేసె
*ఋభునదీసుతుండు *కృష్ణు నేసె
*ఏమిసెప్ప నపుడు *దృఢశక్తి శల్యుండు
*హీనబలునిఁ జేసె *వృష్ణికులుని. 

7. ఋత్వసామ్యయతి:- ఋకారంతో కూడిన భిన్నహల్లులు పరస్పరం యతి చెల్లడం. 
ఉదా-
*మృతుని గావించెఁ గంసునిఁ *గృష్ణుఁ డనఁగ. [అప్పక. ౩.౩౪]
*గృహసమ్మార్జనమో జలాహరణమో *శృంగారపల్యంకికా [ఆముక్త. ౨.౯౧]

8. వృద్ధియతి:-  వృద్ధిసంధిలో ఆదేశంగా వచ్చిన అచ్చుకు యతి చెల్లడం.  ఏక+ఏక=ఏకైక... ఇందు స్వరప్రధాన యతివల్ల ఏకారానికి యతి చెల్లుతుంది. ఆదేశంగా వచ్చిన ఐకారానికి కూడ యతి చెల్లడం వృద్ధియతి.
ఉదా-
*ఇభభయవిదార సర్వలో*కైకవీర
అఖిలభువనప్రశస్త జి*తైణహస్త
ఉదధిజాశ్రితపక్ష భ*క్తౌఘరక్ష
హతపరానీక నందప్ర*జౌక యనఁగ [అప్పక. ౩.౩౮]

9. ఌకారయతి:- ఌకారానికి ‘ళి’తో యతి చెల్లుతుంది. ఌకారానికి ప్రత్యేకస్థితి లేనందున ఇది ఏదో ఒక హల్లును ఆశ్రయించి ఉంటుంది.    
ఉదా-
*కౢప్తి లేదు శౌరి గుణావ*ళికి ననంగ. [అనం.ఛంద. ౧.౮౯]

(వ్యంజన యతులు .... తరువాత...)

18 కామెంట్‌లు:

  1. చాలా చాలా ధన్యవాదములు గురువుగారు...

    రిప్లయితొలగించండి
  2. గురువుగారికి ధన్యవాదాలు మంచి విషయం ప్రస్తావనకి తెచ్చారు.

    రిప్లయితొలగించండి
  3. ఖండిక, కావ్యములు వ్రాయు నప్పుడు మొదటిపాదంలో నిషేధాక్షరాలును గూర్చి తెలియ జేయండి.

    రిప్లయితొలగించండి
  4. కొన్ని సందేహాలు నివృత్తి అయినవి గురువు గారు

    రిప్లయితొలగించండి
  5. లోకజనని నీదు లోచనమ్ముల కాంతి
    పడని నాదు జన్మ పతితమగును
    లోకరక్షకి నీవు లోపాలు గల నన్ను
    కాంచి కావుమమ్మ కరుణమీర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాధవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "లోకరక్షకి యిక లోపాలు గల నన్ను" అనండి.

      తొలగించండి
  6. 1.ఆలుమగలప్రేమ ఆప్తమిత్రుల ప్రేమ
    అన్ని ప్రేమలందు హద్దులుండు
    అమ్మప్రేమయొకటె అవధులు లేనిది
    తెలిసి మసలుకోర తెలివిమీర

    2.దీనజనుల కొరకు దేవతార్చన సేయు
    మనుజుడొందడఘము మహినియెపుడు
    పరుల సేవ కన్న పరమార్థమది లేదు
    తెలిసి మసలుకోర తెలివిమీర

    3.ఇంటిలోన ఉన్న ఇందుబింబపు కాంతి
    వెలుగునిచ్చు నీకు వెరచుటేల
    బ్రతుకు భారమౌను ప్రక్క చూపుల తోడ
    తెలిసి మసలుకోర తెలివిమీర

    4.అతివ వలన అవని అందమెక్కుచునుండు
    ఆమె క్షేమమెపుడు హాయిగొల్పు
    అతివ లేని అవని అంధకారంబౌను
    తెలిసి మసలుకోర తెలివిమీర

    5.మనసు మాట వినదు మతి తప్పి చరియించు
    కడకు బాధవొంది కష్టపడును
    మనిషికన్న వాడి మనసు ముఖ్యముకదా!
    తెలిసి మసలుకోర తెలివిమీర

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారు నమస్కారము.ఈ మధ్యనే కొత్తగా పద్యాలు రాస్తున్నాను.పై పద్యాలలో దోషాలేవైనా ఉంటే తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి
  8. "పచ్చనైన చెట్టు పద్యమయ్యె" సమస్యకు పూరణం చేశాను.దోషాలు తెలుపగలరు.

    తెలుగు నేల తరువు తెలుగు రసము పీల్చి
    గుణములద్దికొనియె గుండెనిండ
    కొమ్మ రెమ్మ పూలు కొత్తగా పూచిన
    పచ్చనైన చెట్టు పద్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  9. హృద్యము నకు ఏయే యతులు వాడవచ్చు

    రిప్లయితొలగించండి
  10. నాగు నోట పలుకు తథ్య మిదియె యతి కుదురుతుంద మహోదయ

    రిప్లయితొలగించండి