23, మార్చి 2015, సోమవారం

యతిభేదాలు - 2

ఆ. వ్యంజన యతులు:- 
1. ప్రాణియతి :- అచ్చులను ప్రాణాలంటారు. అచ్చులతో కలిసి ఉండే హల్లులను ప్రాణులు అంటారు.  హల్లుతో పాటు దాని మీది అచ్చుకు  కూడా  (స్వరయతుల ప్రకారం) యతిమైత్రి పాటించాలి.
ఉదా-
i) క-కా-కై-కౌ; ii) కి-కీ-కృ-కౄ-కె-కే; iii) కు-కూ-కొ-కో.

2. సంయుక్తాక్షరయతి :- ఒకటికంటె ఎక్కువ హల్లులు కల అక్షరం సంయుక్తాక్షరం. అటువంటి సంయుక్తాక్షరం పాదం మొదటి అక్షరంగా కాని, యతిస్థానంలో కాని ఉంటే అందులో ఏదో ఒక హల్లుకు మైత్రిని పాటించవచ్చు. 
ఉదా-
*స్మరసన్నిభ సుభగమూర్తి *మల్లియరేచా [కవిజనా. ౧.౭౧]
*స్మరజనకా వాసుదేవ *సజ్జనవినుతా.
*శివ భవ కరుణాలవాల *శ్రీకంఠ హరా.
*రేబవలున్ గొలుతు నిన్ను *శ్రీకంఠ హరా.

3. వర్గయతి :- క,చ,ట,త,ప వర్గా లైదు. ఒక్కొక్క వర్గంలో మొదటి నాలుగు అక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. i) క-ఖ-గ-ఘ; ii) చ-ఛ-జ-ఝ; iii) ట-ఠ-డ-ఢ; iv) త-థ-ద-ధ; v) ప-ఫ-బ-భ.

4. బిందుయతి (అనుస్వారయతి) :- బిందువు అంటే అనుస్వారం (సున్న). ప్రతివర్గంలో మొదటి నాలుగు అక్షారాలు బిందుపూర్వకాలైనపుడు ఆయా వర్గాల పంచమ (అనునాసిక) అక్షరాలతో యతి చెల్లుతుంది. i) ంక,ంఖ,ంగ,ంఘ - ఙ; ii) ంచ,ంఛ,ంజ,ంఝ - ఞ; iii) ంట,ంఠ,ండ,ంఢ - ణ; iv) ంత,ంథ,ంద,ంధ - న; v) ంప,ంఫ,ంబ,ంభ - మ.
ఉదా-
*ఙాకు వడి చెల్లు రత్నకం*కణ మనంగ
*ఞాకు వడి చెల్లు బర్హిపిం*ఛం బనంగ
*ణాకు వడి చెల్లుఁ గనకమం*డప మనంగ
*నాకు వడి చెల్లు దివ్యగం*ధం బనంగ
*మాకు వడి చెల్లు విజితశం*బరుఁ డనంగ. [కవిజనా. ౬౯]

5. అనుస్వార సంబంధయతి :- బిందుపూర్వకాలైన టవర్గ, తవర్గాల మొదటి నాలు గక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. ంట,ంఠ,ండ,ంఢ - ంత,ంథ,ంద,ంధ. 
ఉదా- 
*దాలం బండు నొకప్పుడుం దరుగ దిం*టం బాడియున్ బంటయున్. [మనచ. ౧.౫౫]

6. అనునాసికాక్షర యతి :- బిందుపూర్వకాలైన టవర్గలోని మొదటి నాలు గక్షరాలు నకారంతోను, బిందుపూర్వకాలైన తవర్గలోని మొదటి నాలు గక్షరాలు ణకారంతోను యతి చెల్లుతాయి. ంట,ంఠ,ండ,ంఢ - న; ంత,ంథ,ంద,ంధ - ణ.
ఉదా-
భం|*డన నిర్జిత కార్తవీర్య *నరనాయక ఖం...
నం|*దన చందన చక్రవార*ణల సత్కీర్తీ [అప్పక. ౩.౬౩]

7. తద్భవ వ్యాజయతి (జ్ఞాయతి, ప్రాకృతాదేశయతి) :- ‘జ్ఞ’కారం తద్భవాలలో ‘న’కారంగా మారుతుంది. (ఆజ్ఞ-ఆన). ఈ వ్యాజంతో జ్ఞ - న లకు యతి చెల్లుతుంది.  సరసయతి ‘న-ణ’ల యతిని చెప్పినందున జ్ఞ-న-ణ లకు యతి చెల్లుతుంది.
ఉదా-
*జ్ఞాని చేతోంబుజాత శో*కర యనంగ
*జ్ఞాతివిద్వేషి నృపనాశ*నకర యనంగ. [అప్పక. ౩.౫౪.]

8. విశేషయతి :- ‘జ్ఞ’తో  క, ఖ, గ, ఘ లకు యతి చెల్లడం. దీనిని అప్పకవి యొక్కడే చెప్పినాడు.
ఉదా-
*జ్ఞానికి నుపదేశవిధిఁ బ్ర*కాశము సేయం... [భారత.శాం. ౪.౨౫౫]
*కర్మ మధర్మ మ*జ్ఞాన మాగడము [పండితా.పురాతన. ౨౮౪ పు.]
*జ్ఞానేంద్రియజ్ఞాన*కళ లౌరుసౌరుగా [కాశీ. ౧.౧౩౯]

9. మువిభక్తియతి (పోలికయతి) :- ప్రథమావిభక్తి ప్రత్యయమైన ‘ము’కారానికి, ఉత్వ ఓత్వాలతో కూడిన ప,ఫ,బ,భ లకు యతి చెల్లుతుంది. (వన‘ము’-పు-ఫూ-బొ-భో మొ.)
ఉదా-
*బుట్టిన సదసద్వివేక*ములు గలిగిన దా [భారత.ఆది. ౫.౫౮]
భూనుత ధాన్యంబు బీజ*ములు వణిజులకున్ [భారత.సభా. ౧.౪౪] 

10. ముకారయతి (చక్కటియతి) :- ప్రథమావిభక్తి ప్రత్యయం కానట్టి ‘ము’ వర్ణంతో ఉత్వ ఓత్వాలతో కూడిన ప,ఫ,బ,భ లకు యతి చెల్లుతుంది. (తో‘ము’-పు,ఫూ,బొ,భో)
ఉదా-
*పొడఁగాంచి తాను త*మ్ములు నెదురేగి [గౌరన హరిశ్చం. ౭౩ పం.]
*ముందు మీ రెఱిఁగిన *భూతలాధీశు [గౌరన హరిశ్చం. ౮౫ పం.]

11. మవర్ణయతి :- బిందుపూర్వకాలైన అంతఃస్థాలు (య,ర,ల,వ లు), ఊష్మాలు (శ,ష,స,హ లు) మకారంతో యతి చెల్లుతుంది.
ఉదా-
*మర్దితదైత్యసం*యమిమనోబ్జాదిత్య
*మహితమేఘాభ సం*రక్షితేశ
*మాయాప్రవర్తి సం*లబ్ధనిర్మలకీర్తి
*మణిహార సురవశం*వదవిహార
*మందరధైర్య వం*శ నినాద చాతుర్య
*మా భూప యువతి పుం*షండరూప
*మంజులస్వాంత కం*స ధరావరకృతాంత
*స్మరహరారాధ్య సిం*హనిభమధ్య.... [అప్పక. ౩.౭౬]

12. ఋజుయతి :- య, హ లకు యతి చెల్లుతుంది. (చూ. సరసయతి)
ఉదా-
*హాయను ధర్మరాజతన*యా యను నన్నెడఁ బాయనీకు... [భార.ద్రోణ. ౨.౨౪౨] 

13. ప్రత్యేకయతి :- ‘అది’ అనేది చేరినప్పుడు సంధి వికల్పము. చేతి+అది = చేతిది అని సంధి జరిగినప్పుడు ‘తి’కారానికి, చేతి+అది= చేతి యది అని సంధి జరుగనప్పుడు ఆగమ యకారానికి సంధి చెల్లుతుంది.
ఉదా-
*అరయ శార్ఙ్గంబు హరి చేతి*యది యనంగ
*దివ్యచాపంబు శూలి చే*తిది యనంగ. [అప్పక. ౩.౮౦]

14. భిన్నయతి :- ‘ధరించు, ధరియించు’ మొదలైన ఉభయరూపాలలో మొదటి రూపానికి ‘రి’, రెండవరూపానికి ‘యి’ యతిమైత్రి చెల్లించాలి.
ఉదా-
*ఎత్తిన నెత్తనిమ్ము వచి*యించెదఁ గల్గినమాట గట్టిగా [విజయ. ౩.౧౫]
*చిత్తజాంతకుఁడు వ*చించె నిట్లు.

15. ఎక్కటియతి (ఏకతరయతి) :- ‘మ-ర-ఱ-ల-వ’ ఈ ఐదింటిలో ఏ అక్షరాని కా అక్షరమే యతి చెల్లుతుంది. (మకారం బిందుపూర్వకాలైన పవర్గంలోని మొదటి నాలు గక్షరాలకు, ల-ళ లకు, పఫబభ లకు వకారంతో చెల్లుతాయి) ర-ల యతిని అధికులు అంగీకరించలేదు. ర-ఱ యతిని ఎవరూ ఒప్పుకొనలేదు. 
ఉదా-
*రార బాలకృష్ణ *రచ్చల గుమిఁగూడి
*ఱాఁగ యనుచు నిన్ను ఱవ్వఁబెట్టు. [అప్పక. ౩.౯౫]

16. అభేదయతి :- i) వ-బ; ii) ల-డ; iii) ల-ళ; iv) ళ-డ. పై నాలుగు వర్గాలలో ఆయా వర్గాలలోని అక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. v) ర-ల; vi) ఱ-ల; vii) ద-డ లకు కూడా యతి చెల్లుతుందని కూచిమంచి వెంకటరాయడు చెప్పినాడు.
ఉదా- 
*వసుమతీకళత్ర *బకజైత్ర గానక
*లాలసత్కలాప *డంభగోప
*లలితదేహ పింగ*ళపుర దక్షిణగేహ... [అప్పక. ౩.౮౮]
*డే కదలక జలధిఁ బవ్వ*ళించె ననఁగ. [అనం.ఛంద. ౧.౯౫]
*లీలాహాస్యకలాప్రసంగముల ను*ద్రేకించి వర్తింతు రే [కాశీ. ౬.౨౧౦.]
*దంతునే కాలదం*డమున నభవ. [కాశీ. ౭.౮౦]

17. అభేదవర్గ యతి :- ‘వబయోరభేదః’ అని చెప్పబడటం వల్ల వకారానికి బకారంతోను, బకారమైత్రి వల్ల ప,ఫ,భ లకు యతి చెల్లుతుంది. 
ఉదా-
*వనజనయన భక్త*పారిజాత
*వాసవాది వినుత *ఫాలనేత్ర
*వచ్చె రాజు భటులు బరా*బరి యొనర్ప
*వందితాఖిలమునిగణ *భక్తపాల.

18. ఊష్మయతి :- ‘శ,ష,స’ ఊష్మాలలోని మొదటి మూడక్షరాలు. వీటికి పరస్పరం యతి చెల్లుతుంది. నాల్గవదైన ‘హ’కు ఋజుయతి ప్రకారం యకారంతో యతి చెల్లింది.
ఉదా-
*శతమఘోపల భూషాను*షంగ యనఁగ
*షడ్జయుత వేణునాద ప్ర*సంగ యనఁగ. [అప్పక. ౩.౧౦౪]

19. సరసయతి :- i) అ-ఆ-ఐ-ఔ-య-హ; ii) చ-ఛ-జ-ఝ-శ-ష-స; iii) న-ణ; ఈ మూడు వర్గాలలో అయా వర్గాలలోని అక్షరాలు పరస్పరం యతి చెల్లుతుంది.
ఉదా-
i) *అంబుజాక్ష కంస*హర పార్థసారథి
*యాదవకులభూష *హరి ముకుంద.
ii) *శకటదానవసంహార *చక్రధారి
*షట్పద శ్యామమూర్తి స్వే*చ్ఛాప్రవర్తి
స్వర్ణపట పరిధాయి భు*జంగశాయి. [అప్పక. ౩.౧౦౬]
iii) *నరక దైత్యవిరోధి ఘృ*ణాపయోధి. [అప్పక. ౩.౧౦౭] 

20. అంత్యోష్మసంధియతి :-  సంధిలో పొల్లులైన క చ ట త ప లకు హకారం పరమైనపుడు ఆ హకారానికి ఆయా వర్గాల చతుర్థాక్షరాలు వికల్పంగా ఆదేశ మౌతాయి.  వాక్+హరి = వాగ్ఘరి, వాగ్హరి.   'గ్ఘ' కు  క, హ లతో యతిమైత్రి. 
ఉదా-
*కైరవకామ దు*గ్ఘరవాహ కవికుంద
హైరణ్యగర్భ వా*గ్ఘరి సబృంద. [అప్పక. ౩.౧౧౫]

21. వికల్పయతి :- వికల్పసంధి జరిగినపుడు పూర్వ పదాంతవర్ణానికి కాని, ఆదేశవర్ణానికి కాని యతి చెల్లించవచ్చు.  సత్+మతి = సన్మతి లో 'న్మ' కు త,న,మ లతో యతిమైత్రి. 
ఉదా- 
*నందసుకుమార గూఢపా*న్మదవిహార
*దళిత శిశుపాల గోత్రభి*న్మణి వినీల
*నాగపర్యంకశాయి స*న్మార్గయాయి
*ధాతృనుతనామ యోగిహృ*న్మధ్యధామ. [అప్పక. ౩.౧౧౭]

(ఉభయయతులు రేపు)....

8 కామెంట్‌లు:

  1. ఒక సందేహం గురువుగారు .

    బిందు యతి చెప్పినపుడు వర్గం లోని మొదటి నాలుగు పరస్పరం యతి చెల్లించవచ్చును కాని చివరి అక్షరం కి మాత్రం బిందుపూర్వక మైనవర్గాక్షరాలతో యతి కుదిర్చాలి అని చెప్పారు. మరి మళ్ళి విశేష యతి లో జ్ఞా కి క,ఖ,గ,ఘ యతి వుందని చెప్పారు.అప్పుడు పైన బిందు పూర్వకం గా వుండాలి అన్న వాదన నిలబడదు కదా. దయచేసి వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  2. చాలా చాలా.... ధన్యవాదములు గురువు గారు!

    రిప్లయితొలగించండి
  3. పిరాట్ల ప్రసాద్ గారూ,
    అందుకే దానిని విశేషయతి అని ప్రత్యేకంగా చెప్పారు. బిందుయతిలో బిందుపూరకమైన కఖగఘ లకు ‘ఙ’ తో యతి చెప్పబడింది. ‘జ్ఞ’ తో కాదు.

    రిప్లయితొలగించండి
  4. నమస్కారం ! అసలు యతి యొక్క ప్రయోజనం ఏమిటి అనేది పరిశీలిస్తే- "పాదం లోని మొదటి వర్ణం తిరిగి ఒక నిర్ణీతస్థానం లో రావటం వలన పద్యానికి అందం వస్తుంది. ఆ వర్ణమే రాకపోయినా ఉచ్చారనలో దానికి పోలిన వర్ణం వస్తే అందంగా ఉంటుంది" అనే కదా . ఈ దృష్టితో చూస్తే క ఖ గ ఘ వరకే యతిమైత్రి న్యాయం. జ లేక జ్ఞ దేనితోనూ ఆ అక్షరాలకి సామ్యం లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవిప్రసాద్ గారూ,
      ధన్యవాదాలు. నేను మీ అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. పూర్వకవులు ప్రమాదవశాత్తు ఎక్కడో ఒకచోట ప్రయోగించినవాటికి (ఆర్యవ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు - అన్నట్టుగా) స్వీకరించి వాటికి లక్షణాలను చెప్పారు. యతిభేదాలలో అటువంటివి ఎక్కువగానే ఉన్నాయి. నిజానికి నేను ‘అఖండయతి’ని నా పద్యాలలో ఎక్కడా ప్రయోగించను. ఎవరైనా ప్రయోగిస్తే అభ్యంతరం చెప్పను.

      తొలగించండి
  5. పొరలిన... ముంగురుల్ అనేచోట ఈ కు ఏ, ఉ కు ఓ లు యతులైనప్పుడు ప్ర మాణాలు ఉన్నాయి.. మందిరముల... మ కు పాడొనరించ...పా కు యతి కుదరక పోవడానికి కారణం క న్ఫడుట లేదు...యతి శాసనాన్ని శిరసా వహిస్తా...

    రిప్లయితొలగించండి
  6. నా కారానికి ఏ అక్షరం తో యతి కుదురుతుంది

    రిప్లయితొలగించండి